
హైదరాబాద్, 25 జూన్ (హి.స.)
కరీంనగర్ కార్పొరేషన్ డ్రైనేజీల నుండి
బయటకు తీసిన టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త కుప్పల ఫొటోలను షేర్ చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పౌర బాధ్యత పై ఒక కీలక పోస్ట్ పెట్టారు. ఇది కేవలం కరీంనగర్ డ్రైనేజీల నుండి తీసిన చెత్త కుప్ప మాత్రమే కాదు.. మన అజాగ్రత్తకు నిలువెత్తు నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. నగరంలోని కోర్టు జంక్షన్, ట్రినిటీ కాలేజ్, కెమిస్ట్రీ భవన్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల గుండా నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ.. రోడ్డుపై పడేసిన ఒక్కో ప్లాస్టిక్ బాటిల్, కప్పు కాల్వల్లో చేరి దశాబ్దాలుగా డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత, దశాబ్దాలుగా పేరుకుపోయిన ఈ మట్టి, వ్యర్థాలను తొలగించడానికి ప్రత్యేక నిధులను వెచ్చిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిబద్ధతను బండి సంజయ్ ఉదహరించారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడైనా చిన్న ప్లాస్టిక్ కాగితం, వాటర్ బాటిల్ కనిపిస్తే.. డస్ట్ బిన్ దొరికే వరకు వాటిని తన జేబులోనే ఉంచుకుంటారనే విషయం మనందరికీ తెలుసు. దేశ ప్రధానికే అంతటి వ్యక్తిగత బాధ్యత ఉన్నప్పుడు, మన నగర పారిశుధ్యంపై మనకు ఎందుకు బాధ్యత ఉండాలి అని ప్రశ్నించారు. కరీంనగర్ను పరిశుభ్రంగా ఉంచడానికి కొత్తగా ప్రభుత్వ జీవోలు అవసరం లేదని, కేవలం ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వస్తే చాలన్నారు. ఇది మన నగరం, మన వీధులు, మన బాధ్యత అని గుర్తు చేస్తూ.. ఇకపై ప్లాస్టిక్ బాటిళ్లు, వ్యర్థాలను రోడ్లపై, కాల్వల్లో పడేయకుండా డస్ట్ బిన్లలోనే వేయాలని, కరీంనగర్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..