జనం కోసం పనిచేసే వారే సమాజానికి ఆదర్శం.. వెంకయ్య నాయుడు
జనం కోసం పనిచేసే వారే సమాజానికి ఆదర్శం.. వెంకయ్య నాయుడు
Venkaiah Naidu


కోదాడ, 25 జూన్ (హి.స.)

కోదాడ పట్టణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గురువారం ఘనంగా ప్రారంభించారు. కోదాడకు చేరుకున్న ఆయనకు కాకతీయ సేవ సమితి నాయకులు, సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, తాను పదవి విరమణ చేశానే గానీ పెదవి విరమణ చేయలేదని వ్యాఖ్యానించి సభికులను ఆకట్టుకున్నారు. తాను సంపాదించిన జ్ఞానాన్ని యువతరానికి అందించేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని తెలిపారు. మంచి పనులు చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సర్వేజనాః సుఖినో భవంతు అనే భావనతో సమాజం వసుధైక కుటుంబంగా ఉండాలని ఆకాంక్షించారు.సంపదకు మనం ధర్మకర్తలమని, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పనినే ధర్మమని పేర్కొన్నారు. ఇష్టపడి, కష్టపడి పని చేస్తే ఎవరూ నష్టపోరని యతి ప్రాసలతో ప్రసంగాన్ని రంజింపజేశారు.

ఆవు, చెట్టు పరులకు ఉపకారం కోసం జీవిస్తాయని, మనుషులు కూడా సేవా భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రకృతిని ప్రేమించి కాపాడాలని, ప్రస్తుతం ప్రకృతి పరితపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. “నేచర్ అండ్ కల్చర్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అనే సందేశాన్ని అందించారు.కులం ఉండవచ్చని, కానీ కులపిచ్చి ఉండకూడదని స్పష్టం చేశారు. సేవా భావంతో అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాను న్యాయవాదిగా మారాలనుకున్నప్పటికీ, అత్యవసర పరిస్థితుల ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తన బాల్య జీవితంలోని పలు సంఘటనలను సభికులతో పంచుకున్నారు.రాజకీయాల్లో ఉన్నవారు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలని వెంకయ్య నాయుడు చేసిన సూచనలను ప్రస్తావిస్తూ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ కోవకు చెందిన నాయకుడని వెంకయ్య నాయుడు ప్రశంసించారు. కళ్యాణ మండప నిర్మాణానికి భూరి విరాళాలు అందించిన దాతలను అభినందించిన ఆయన, సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాకతీయ కమ్మ సేవా సమితి బాధ్యులు, దాతలు, ప్రముఖులు, సభ్యులు, వివిధ రంగాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం సేవ సమితి ఆధ్వర్యంలో ప్రతిభ కలిగి న విద్యార్థులకు మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, రావెళ్ళ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande