
కదిరి, 25 జూన్ (హి.స.) నంబులపూలుకుంటలో రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా చేపడుతున్న సోలార్ కంపెనీ భూసేకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ కదిరిలో వైఎస్సార్సీపీ భారీ ఆందోళన చేపట్టింది.
శ్రీ సత్య సాయి జిల్లా నంబులపూలుకుంట మండలంలో సుమారు 15 వేల ఎకరాలలో ఏర్పాటు చేయనున్న సోలార్ కంపెనీ పనులను వెంటనే ఆపివేయాలని కదిరి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త బిఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బస్టాండ్ కూడలిలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఐదు పంచాయతీలలో ఏర్పాటు కానున్న సోలార్ కంపెనీనీ రైతులందరూ వ్యతిరేకిస్తున్న సోలార్ కంపెనీలు భూమి పూజలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు ఇష్టం లేకుండా చేపడుతున్న బలవంతపు భూసేకరణ వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయం దండగా అని చెప్పే చంద్రబాబు నాయుడు రైతులకు మరోసారి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. రైతులకు ఇష్టం లేకుండా సోలార్ కంపెనీని ఏర్పాటు చేస్తే వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో పూర్తిగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం వైయస్సార్ కూడలి నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. రైతులకు ఇష్టం లేకుండా బలవంతపు సేకరణ చేపట్టొద్దని కంపెనీలు కూడా ఏదైతే భూమి పూజలు చేస్తున్నాయో వాటిని వెంటనే ఆపేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ సీపీ చేపట్టిన ఆందోళనకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు చాంద్ బాషా, పూల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV