.ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలకు.హంగులు
అమరావతి, 03 జూన్ (హి.స.) పాడేరు/పట్టణం, ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలకు కొత్త హంగులు అద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకు రూ.కోట్లలో నిధులు విడుదల చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా కనీస వసతులు లేని ఆ
.ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలకు.హంగులు


అమరావతి, 03 జూన్ (హి.స.)

పాడేరు/పట్టణం, ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలకు కొత్త హంగులు అద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకు రూ.కోట్లలో నిధులు విడుదల చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా కనీస వసతులు లేని ఆదర్శ పాఠశాలలను గుర్తించి నివేదిక సిద్ధం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 2,952 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 40 శాతం ఆదర్శ పాఠశాలలు కనీస సదుపాయాలకు దూరంగా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు ఫేజ్ 1, 2 లలో భారీగా నిధులు దుర్వినియోగం జరిగింది. వాస్తవంగా భవనాలు లేని చోట్ల కొత్తవి నిర్మించాల్సింది ఉండగా.. అప్పటికే ఉన్న భవనాలను సుందరీకరణ పేరుతో వందల కోట్లు ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఆ ప్రాజెక్టును రద్దు చేసి ‘మన బడి- మన భవిష్యత్తు’ పేరుతో విద్యా సంస్థల అభివృద్ధితోపాటు కొత్తవి నిర్మించేందుకు నిధులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.929 కోట్లు కేటాయించారు. ఇందులో అల్లూరి జిల్లాకు సుమారు రూ. 100 కోట్లు వచ్చే అవకాశముంది. 2025-26 విద్యా సంవత్సరంలో 208 ఆదర్శ పాఠశాలలను మొదటి దశలో గుర్తించి జాబితాను సిద్ధం చేశారు. ఇంతలో పదో తరగతి పరీక్షలు, ఆ తర్వాత వేసవి సెలవులు రావడంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. పది రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. జిల్లాల వారీగా గతంలో సమర్పించిన ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులు కేటాయించనున్నారు.

పాఠశాలలను తెరిచే నాటికి ప్రధానంగా స్లాబ్ల మరమ్మతు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయం, పెయింటింగ్, డ్యూయల్ డెస్క్ల ఏర్పాటు వంటి సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రెండో దశలో మరికొన్ని పాఠశాలలు గుర్తించి దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. దీనిపై జిల్లా సమగ్ర శిక్షా పథ సంచాలకులు డాక్డర్ స్వామినాయుడు మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాలతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లావ్యాప్తంగా 208 ఆదర్శ పాఠశాలలు గుర్తించామని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande