
అమరావతి, 04 జూన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఈరోజు (గురువారం) ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం.. మంత్రులతో చర్చిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, సంక్షేమ పథకాల అమలుపై మాట్లాడుతున్నారు. అయితే, ఈ సమావేశం కొనసాగుతున్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కివెన్నునొప్పి తీవ్రంగా ఉండటంతో బయటకు వచ్చేశారు. ఈ మేరకు సీఎంకి, మంత్రివర్గ సభ్యులకు సమాచారం ఇచ్చి మధ్యలోనే డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. అనంతరం ఆయన మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
వెన్నునొప్పి కారణంగా వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీ ప్రారంభమైన సుమారు గంట తర్వాత ఆయన ఈ అస్వస్థతకు గురయ్యారు. గతంలో సినిమా షూటింగ్ల సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల ఉన్న పాత వెన్నునొప్పి సమస్య, నిరంతర రాజకీయ పర్యటనల ఒత్తిడి కారణంగా మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. సమావేశం నుండి బయటకు వచ్చిన వెంటనే ఆయన మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకుని, వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని వారాల క్రితమే ఆయనకు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో సైనస్ శస్త్రచికిత్స జరగగా, ఇప్పుడు వెన్నునొప్పి తీవ్రం కావడంపై అభిమానులు, జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై చర్చ..
కాగా, హైకోర్టు భవనాల దగ్గర మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇవ్వనుంది. 9 జిల్లాల పరిధిలో అమరావతి ఎకనామిక్ రీజియన్ RFCకి ఆమోదించనుంది. పీపీపీ ప్రాతిపదికన డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో.. అమరావతిలో పర్యాటకానికి ప్రోత్సాహం కల్పించనుంది. జెయింట్ అబ్జర్వేషన్ వీల్ను నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తల్లికి వందనం పథకానికి నిధుల విడుదలపై మంత్రి మండలి చర్చించనుంది.
పంచాయతీరాజ్ శాఖకు అవార్డులు రావడంపై సీఎం, మంత్రులు హర్షం..
పంచాయతీ రాజ్ శాఖకు పలు అవార్డులు రావడంపై సీఎం చంద్రబాబు, మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ శాఖకు వివిధ విభాగాల్లో వచ్చిన కేంద్ర అవార్డులను కేబినెట్లో అధికారులు ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అభినందించారు. అన్ని శాఖలు అత్యుత్తమ పనితీరు కనపరిచేందుకు ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ