
హైదరాబాద్, 04 జూన్ (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడానికి ఉద్యమకారుల గుర్తింపు కమిటీని ఏర్పాటు చేసిందని.. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన అన్నారు. ఈ మేరకు అఖిలపక్ష పార్టీలను ఇద్దరి చొప్పున పిలవడం జరిగిందన్నారు.
పార్టీలు మాత్రమే కాకుండా ఉద్యోగులు, విద్యార్థులు, జర్నలిస్టులు, న్యాయవాదులు అందరినీ పిలిచి మాట్లాడతామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. వివిధ విభాగాలుగా నష్టం జరిగిన వారికి న్యాయం చేస్తామన్నారు. కవులు, కళాకారులు తెలంగాణ సాధన కోసం పని చేసిన అందరిని గుర్తించి న్యాయం చేస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నాం. రాజకీయాలకు అతీతంగా సలహాలు సూచనలు స్వీకరిస్తాం.. ఆన్లైన్, ఆఫ్లైన్లో విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు