
కర్నూలు, 04 జూన్ (హి.స.)
: ప్రస్తుతం విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్, కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఈ రోజు తెలిపారు.
కొంతమంది మోసగాళ్లు ప్రముఖ పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులమని నమ్మబలికి ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు లేదా సోషల్ మీడియా ప్రకటనల ద్వారా సంప్రదిస్తూ, “సీట్లు పరిమితంగా ఉన్నాయి”.
“రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించి సీటు రిజర్వ్ చేసుకోండి” అంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని తెలిపారు.
ఇలా డబ్బులు చెల్లించిన తర్వాత సంబంధిత విద్యాసంస్థలను సంప్రదిస్తే, తమ వద్ద ఎలాంటి రుసుము జమ కాలేదని, ఆ వ్యక్తులకు తమ సంస్థతో సంబంధం లేదని తెలుస్తోందన్నారు.
ఈ విధంగా అనేక మంది సైబర్ మోసగాళ్ల బారిన పడుతున్నారని హెచ్చరించారు.
తల్లిదండ్రులు, విద్యార్థులు అడ్మిషన్లకు సంబంధించిన ఫీజులను కళాశాల లేదా పాఠశాల అధికారిక కార్యాలయంలో లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే చెల్లించాలని సూచించారు.
అపరిచిత వ్యక్తులు పంపిన బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలు లేదా QR కోడ్లకు డబ్బులు పంపవద్దన్నారు.
ఏదైనా విద్యాసంస్థ పేరుతో ఫోన్ కాల్ వచ్చినప్పుడు ముందుగా సంబంధిత సంస్థ అధికారిక నంబర్ల ద్వారా వివరాలను నిర్ధారించుకోవాలని సూచించారు.
సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా
cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు.
సమయానికి ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును తిరిగి పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV