అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్
అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్
fire


హైదరాబాద్, 04 జూన్ (హి.స.)

అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం దగ్గర్లోని కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. తొలుత ఓ ఆటబొమ్మల దుకాణంలో చెలరేగిన మంటలు క్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో మంటలు వేగంగా అంటుకున్నాయి. మైత్రివనం ప్రాంతంలో అనేక ఆఫీసులు, కోచింగ్ సెంటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉంటాయనే విషయం తెలిసిందే.

మంటల ధాటికి ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున పొగ అలముకుంది. రోడ్డు కనపడనంత తీవ్రంగా పొగ కమ్మేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. మరోవైపు పోలీసులు ట్రాఫిక్ను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.

మంటలు చెలరేగిన వెంటనే షాపింగ్ కాంప్లెక్స్లోని వారంతా బయటకు పరిగెత్తుకొచ్చారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. కానీ, చాలా దుకాణాలు దగ్ధం అవడంతో ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉండే అవకాశం ఉంది. అలాగే షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు సమీపంలోనే మెట్రో స్టేషన్లో కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం లేదని అధికారులు తెలిపారు. సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande