
సూళ్లూరుపేట, 04 జూన్ (హి.స.)
: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను తీవ్రంగా వంచించారని సూళ్ళూరుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు. ఓజిలి బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పాదర్తి హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు, ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేశారని, ఇది ప్రజలకు చేసిన వెన్నుపోటు అని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ఈ ప్రభుత్వం వైఫల్యాలను నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపు మేరకు, వైఎస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు సూపర్ సిక్స్ హామీల ప్రతులను బస్టాండ్ సెంటర్లో బహిరంగంగా తగలబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలును కూటమి సర్కార్ నిర్వీర్యం చేసిందని, ఇప్పటికైనా హామీల అమలులో మొండివైఖరి వీడకపోతే ప్రజలే చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV