
విశాఖపట్నం:, 05 జూన్ (హి.స.)
విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో సీఎం.. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తాం. వర్సిటీకి కావాల్సిన కరెంటును వందశాతం ఇక్కడే ఉత్పత్తి చేసుకోవాలి. చెట్లు లేని ఖాళీ స్థలాలు, భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే రూ.5,18,000 విలువైన విద్యుత్ ఆదా అయింది. తిరుమల తరహాలో క్యాంపస్ మొత్తాన్ని పచ్చదనంతో నింపాలి. ప్రపంచంలోని వివిధ రకాల మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ నాటాలి.
పెరుగుతున్న ఎండలు, వాతావరణ మార్పులను తట్టుకునేలా చేయాలి. హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా పచ్చదనం అభివృద్ధి చేయాలి. హాస్టళ్లు, కాలేజీల నుంచి వచ్చే తడి చెత్త, ఆకులను కంపోస్టుగా మార్చాలి. వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేసి వంట గదులకు ఉపయోగించాలి. రీసైక్లింగ్కు పనికొచ్చే వ్యర్థాలను వేరు చేసి పంపాలి. దేనికీ పనికిరాని చెత్త కోసం ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ ఉపయోగించాలి. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. క్యాంపస్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు పోకూడదు. శుద్ధి చేసిన నీటిని చెట్లకు ఉపయోగించాలి.పైప్ల ద్వారా వచ్చే గ్యాస్తో వంటలు చేయాలి. వంటల కోసం ఎలక్ట్రిక్ స్టవ్లు లేదా PNG గ్యాస్ మాత్రమే వాడాలి. ప్రొఫెసర్లు, నిపుణులతో కూడిన కమిటీ వేసి ఇన్-హౌస్ నాలెడ్జ్ ఉపయోగించుకోవాలి. ప్రతి విద్యార్థి ఐడియాలను తీసుకుని యాక్షన్ ప్లాన్లో భాగస్వామ్యం చేయాలి. ప్రపంచంలోనే టాప్ 10 లేదా టాప్ 20 నాలెడ్జ్ యూనివర్సిటీల సరసన ఏయూను నిలపాలి. క్యాంపస్ లోపల ఎలక్ట్రికల్ సైకిళ్లను అందుబాటులోకి తేవాలి. సైక్లింగ్ ద్వారా కాలుష్యం తగ్గడమే కాకుండా ఫిట్నెస్ పెరుగుతుంది’’ అని సీఎం సూచించారు. అనంతరం నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఏయూ నుంచి నోవాటెల్ వరకు చంద్రబాబు సైకిల్పై ప్రయాణించారు.
ఉత్సాహంగా సైకిల్ తొక్కిన చంద్రబాబు...
విశాఖలోని ఏయూ నుంచి నోవాటెల్ హోటల్ వరకు ఐదున్నర కిలోమీటర్ల దూరాన్ని 21.18 నిమిషాల్లో చంద్రబాబు చేరుకున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవాటెల్కు చేరుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా లెక్కచేయకుండా ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్పై ముందుకు సాగారు. సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబు వెంట కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రులు డీబీవీ స్వామి, జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ