
చిత్తూరు, 05 జూన్ (హి.స.):బంగారు ఆభరణాలపై రుణాలు మంజూరు చేయడం ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)కి ఆదాయం సమకూరుతోంది. తక్కువ శాతం వడ్డీకే బంగారు ఆభరణాలపై డీసీసీబీ రుణాలు అందిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు డీసీసీబీ బ్రాంచ్ల ద్వారా రూ.1125 కోట్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సింగిల్ విండోలు) ద్వారా రూ.250 కోట్ల వరకు రుణాలు అందజేశారు. బ్యాంకు చరిత్రలో ఇదో రికార్డుగా అధికారులు చెబుతున్నారు. బంగారు ఆభరణాలపై రుణ మంజూరులో రాష్ట్రంలో కృష్ణ జిల్లా డీసీసీబీ ప్రథమ స్థానంలో ఉండగా, చిత్తూరు డీసీసీబీ ద్వితీయ స్థానంలో ఉంది.
సహకార బ్యాంకులు కూడా గోల్డ్ లోన్స్ మంజూరుపై ఎక్కువ దృష్టి సారించాయి. 2024-25లో చిత్తూరు డీసీసీబీ రూ.900 కోట్లు బంగారు ఆభరణాలపై ఇవ్వగా, 2025-26లో రూ.1125 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.1200 కోట్ల మేర బంగారంపై రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. రోజువారీ ధరలు బట్టి గ్రాముకు రూ.6500 వరకు ఇస్తున్నారు. బ్రాంచ్ల వారీగా ఏడాదికి అత్యధికంగా తిరుపతి రూ.100 కోట్లు, వి.కోట రూ.60 కోట్లు, సదుం రూ.55 కోట్లు, పీలేరు రూ.50 కోట్లు, సింగిల్ విండోల వారీగా తంగెళ్లపాళ్యం (శ్రీకాళహస్తి, రొంపిచెర్ల, నగరి విండోలు) అధికంగా రుణాలిచ్చాయి.
ఆభరణాలపై ఇటీవల వరకు మార్కెట్ ధరలో 75 శాతం రుణం ఇచ్చేవారు. ప్రస్తుతం బంగారం ధర ఒడిదుడుకుల మధ్య 65 శాతానికి తగ్గించారు. బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నవారు ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. లేనిపక్షంలో నోటీసులు జారీచేస్తారు. మూడు నోటీసుల తర్వాత ఆభరణాలను వేలం వేస్తారు. అయితే బంగారం ధర పెరుగుతున్నందున రుణాలు తీసుకున్నవారంతా ఏడాది వ్యవధిలోగా వాటిని చెల్లించి, తిరిగి రుణం తీసుకుంటున్నారు. దీంతో డీసీసీబీ ఆదాయం గణనీయంగా పెరిగింది. డీసీసీబీ సీఈవో శంకర్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరంలో ఇంతవరకు రూ. 50 కోట్లు ఇచ్చామన్నారు.
ఆర్థిక సంవత్సరాంతానికి ఈ మొత్తాన్ని రూ.1200 కోట్లకు పెంచుతామన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి విలువ పెరగడంతో సొంత అవసరాల కోసం ఎక్కువ మంది ఆభరణాలు కుదువపెట్టి రుణాలు తీసుకుంటున్నారన్నారు. ఏడాది లోగా రుణం చెల్లించి ఆభరణాలను విడిపించుకుంటున్నారని, వేలం వరకు వెళ్లిన సంఘటనలు గడిచిన ఐదారు ఏళ్లలో లేవన్నారు. ఆభరణాలపై రుణాల మంజూరు ద్వారా బ్యాంకుకు, సింగిల్ విండోలకు ఆదాయం పెరిగిందని వివరించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ