రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్
Hospitals


హైదరాబాద్, 05 జూన్ (హి.స.)

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీ ప్రక్రియలో ప్రభుత్వం జీవో నెం.38 నిబంధనలను తుంగలో తొక్కుతూ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రి సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ వైద్య సేవలను నిలిపివేశారు. అయితే అత్యవసర సేవలు, ఇన్పేషెంట్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.38 ప్రకారం బదిలీలు జరగకపోవడంపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్పౌజ్ కోటాలో దరఖాస్తు చేసుకున్న వారికి, అనారోగ్య సమస్యలు ఉండి ప్రాధాన్యత కోరుతున్న వారికి న్యాయం జరగడం లేదని టీజీజీడీఏ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏల్లుగా మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తూ.. వ్యక్తిగత కారణాలతో బదిలీలు కోరుతున్న వైద్యుల వినతిని అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. గుర్తింపు పొందిన సంఘం నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలనే నిబంధనను కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో జీవో 38 జారీ చేసింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశించింది. దీని ప్రకారం రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande