
హైదరాబాద్, 05 జూన్ (హి.స.)
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచే పెంచిన భూముల ధరలు అమల్లోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పూర్తి చేసింది. కార్డుల్లో కొత్త ధరల వివరాలను నమోదు చేసింది. కొత్త వివరాల నమోదుకు గురువారం సాయంత్రం నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ పనిచేయడంలేదు.
భూముల ధరల పెంపు ద్వారా ప్రజల జేబులను గుల్ల చేసి.. సర్కార్ తన ఖజానాను నింపుకోనున్నది. భూముల ధరల పెంపుతో ఏటా రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం చెప్తున్నది. అయితే, రూ.4వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా ధరలు పెంచినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 98 వేల ప్రాంతాల్లో ప్రా భూముల ధరలను సవరించినట్టు తెలిసింది.
కొన్ని ప్రాంతాల్లోనే పెంచినట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, దాదాపు రాష్ట్రమంతా పెంచినట్టు సమాచారం. మెజారిటీ ప్రాంతాల్లో ఈ పెంపుదల 80శాతానికిపైగా ఉన్నదని తెలిసింది. ప్రాంతాలు, భూముల ధరలను బట్టి ప్రస్తుత ధరలపై 50% నుంచి 100% ధరలు పెంచినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాల్రెడ్డి తెలిపారు. ప్రైమ్ ఏరియాల్లో 100% పెంచినట్టు వెల్లడించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇది 300 శాతానికిపైగా ఉన్నదని సమాచారం. ఎలాంటి శాస్త్రీయత లేకుండా భారీ ఆదాయమే లక్ష్యంగా ఇష్టానుసారం భూముల విలువలను పెంచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పెంపుతో ప్రజలకు రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగనున్నది. రిజిస్ట్రేషన్ చార్జీలు రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు