
నాగర్కర్నూల్, 05 జూన్ (హి.స.)
ప్రతిష్టాత్మక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. నిన్నటి నుంచి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం, ఇవాళ నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో సాగుతున్న ప్రాజెక్టు పనులను మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఇవాళ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కొల్లాపూర్ (Kollapur) మండలంలోని నార్లాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీ-1 పనులను సందర్శించారు. అక్కడ నిర్మాణంలో ఉన్న హెడ్ రెగ్యులేటర్ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నార్లాపూర్ వద్ద ఉన్న డెలివరీ సిస్టర్న్్న సీఎం, మంత్రుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం నార్లాపూర్ (Narlapur) ముంపు గ్రామాల ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భూ నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను, పరిహారం పంపిణీలో జరుగుతున్న ఆలస్యాన్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయమైన డిమాండ్లను త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేసేందుకు వీలుగా పనుల వేగాన్ని మరింత పెంచాలని అధికారులను, కాంట్రాక్ట్ సంస్థలను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..