‘నెట్ జీరో వేస్ట్ - హెల్తీ క్యాంపస్’లు...‘అనంత అరణ్య’ కార్యక్రమం
‘నెట్ జీరో వేస్ట్ - హెల్తీ క్యాంపస్’లు...‘అనంత అరణ్య’ కార్యక్రమం
collector-and-mla-launch-anantha-aranya-progr


నంద్యాల, 05 జూన్ (హి.స.)

: భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా పాఠశాలలను ‘నెట్ జీరో వేస్ట్ - హెల్తీ క్యాంపస్’లుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేపట్టిన ‘అనంత అరణ్య’ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో కీలక మైలురాయిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు గ్రామంలో ఉన్న కేజీబీవీ పాఠశాల ఆవరణలో అటవీ శాఖ, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ (అనంత అరణ్య) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.*

అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలు మొక్కలు నాటి హరితహార కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు కూడా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల తమ బాధ్యతను చాటుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కల పెంపకం అత్యంత అవసరమని, అనంత అరణ్య వంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం ద్వారా పచ్చదనాన్ని విస్తరించాలని, ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

అనంత అరణ్య కార్యక్రమం కింద తొలి విడతలో జిల్లాలోని 50కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)తో పాటు ఇతర భాగస్వామ్య సంస్థల సహకారంతో పాఠశాలల్లో మొక్కల పెంపకంతో పాటు సోక్పిట్లు, కంపోస్ట్ పిట్లు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, కిచెన్ గార్డెన్లు, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వంటి పర్యావరణహిత చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande