డబుల్ బెడ్రూం ఇళ్లలో పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ బి.చంద్రశేఖర్
డబుల్ బెడ్రూం ఇళ్లలో పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ బి.చంద్రశేఖర్
Collector


నల్గొండ, 05 జూన్ (హి.స.)

డబుల్ బెడ్రూం ఇళ్లలో మిగిలి ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని గొల్లగూడలో గల డబుల్ బెడ్రూం గృహ సముదాయాన్ని పరిశీలించారు. గొల్లగూడ డబుల్ బెడ్రూం ఇళ్లలో అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్, విండోలు, వాటర్ ట్యాంకులు, నీటి ట్యాపులు, లైటింగ్, తలుపులు, బాత్రూంలు, టాయిలెట్లు, కిచెన్ గదులు తదితర పనులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే గృహ సముదాయం మొత్తాన్ని శుభ్రపరచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అలాగే లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, జిమ్, పార్కులు, బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం, జిరాక్స్ సెంటర్, మీ సేవా కేంద్రం, మెడికల్ షాప్, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ను ఆదేశించారు.

అదేవిధంగా లే అవుట్ బోర్డులు, దిశా నిర్దేశిక సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గృహ సముదాయం పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, వైకుంఠధామం, క్రీడా మైదానం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం మాత్రమే కాకుండా, నివాసితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఒకేచోట అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande