
తిరుపతి, 05 జూన్ (హి.స.)
ప్రముఖ ఐస్క్రీమ్ బ్రాండ్
హ్యాంగ్యో ఐస్క్రీమ్స్ (Hangyo Ice Creams) ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో
సరికొత్త, అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించింది. శ్రీ
సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠాధిపతి పరమపూజ్య శ్రీమద్ విద్యాధీశతీర్థ
స్వామీజీ దివ్య ఆశీస్సులతో ఈ నూతన ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకకు
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఆహార శుద్ధి శాఖల మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి
నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిలతో పాటు
హ్యాంగ్యో ఐస్క్రీమ్స్ వ్యవస్థాపకులు దినేష్ ఆర్ పై, ప్రదీప్ జి పై మరియు పలువురు
ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తిరుపతి సమీపంలోని రేణిగుంట
మండలం గాజులమండ్యం పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ సరికొత్త పరిశ్రమ ద్వారా
ప్రతిరోజూ 1,00,000 లీటర్ల ఐస్క్రీమ్ను ఉత్పత్తి చేయవచ్చు. పూర్తి ఆటోమేటెడ్
ప్రొడక్షన్ సిస్టమ్స్, కఠినమైన ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు, అత్యాధునిక కోల్డ్-చైన్
స్టోరేజ్ మరియు ఇంధన పొదుపు మౌలిక సదుపాయాలతో ఈ ప్లాంట్ను నిర్మించారు. ఈ భారీ
పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానిక ప్రాంతానికి చెందిన సుమారు 250 కి పైగా యువతకు ప్రత్యక్ష
ఉద్యోగాలతో పాటు వందలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కర్ణాటకలో
ప్రస్థానాన్ని ప్రారంభించి దక్షిణాదిలో ప్రముఖ బ్రాండ్గా ఎదిగిన హ్యాంగ్యో ఐస్క్రీమ్స్, ఈ తిరుపతి ప్లాంట్ ద్వారా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మార్కెట్లలో తమ ఉత్పత్తుల సరఫరాను మరింత వేగవంతం
చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi