మిర్యాలగూడలో ఘోర అగ్నిప్రమాదం: సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం
మిర్యాలగూడలో ఘోర అగ్నిప్రమాదం: సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం
మిర్యాలగూడలో ఘోర అగ్నిప్రమాదం: సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం


మిర్యాలగూడ , 05 జూన్ (హి.స.)

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని కలాల్వాడ ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది.

వివరాల్లోకి వెళ్తే.. వనం చంద్రకళ (45), తన మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14)తో కలిసి ఒక పెంకుటింట్లో నివసిస్తున్నారు. గురువారం రాత్రి వీరంతా నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఇంట్లోని గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో మంటలు క్షణాల్లో ఇల్లంతా వ్యాపించడంతో ఆ ముగ్గురూ బయటకు రాలేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

చంద్రకళ భర్త నెల రోజుల క్రితమే అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె (పిల్లల తల్లి) నక్కా ధనమ్మ ఉపాధి నిమిత్తం ఇటీవల పుణె వెళ్లారు. దీంతో పిల్లల సంరక్షణ బాధ్యతను చంద్రకళే చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఘోర దుర్ఘటన జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. డీఎస్పీ, సీఐ సహా ఉన్నత పోలీస్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande