
నెల్లూరు, 06 జూన్ (హి.స.)నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఈ రోజు శనివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) సుబ్బారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి, సరైన పత్రాలు లేని 56 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. యువత గంజాయి, గుట్కా, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని హెచ్చరిస్తూ, రహదారి భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నేటి నుంచి సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆటోలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని నలుగురు ఎస్సైలు, 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV