
నర్సీపట్నం, 07 జూన్ (హి.స.)
మైదాన ప్రాంతాల్లో బైకులను దొంగిలించి ఏజెన్సీలో విక్రయించే ముఠాలోని ముగ్గురు నిందితులను నాతవరం పోలీసులు ఆరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... వెదురుపల్లి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఒక బైకుపై వస్తున్న ముగ్గురు కనిపించారు. వారు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు. విచారణలో వారు బైకు దొంగతనాలకు పాల్పడే ముఠాగా గుర్తించారు. నిందితులు నాతవరం మండలం పెదగొలుగొండ పేటకు చెందిన మాతిరెడ్డి మనోజ్ (21), కాకినాడ జిల్లా తుని మండలం డి.పోలవరానికి చెందిన కిర్లంపల్లి సుబ్రహ్మణ్య కిరణ్ (23), అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం కొత్తవాడకు చెందిన వంతల కొండబాబు (22) అని డీఎస్పీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ