
పోలవరం జిల్లా,, 07 జూన్ (హి.స.)
పోలవరం జిల్లానేలకోట, పుడిపల్లి ప్రాంతంలో సంచరిస్తున్న పులి కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక హనుమాన్ బృందాలు నిన్న(శనివారం) రాత్రంతా అప్రమత్తంగా పనిచేశాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. డ్రోన్ నిఘా, క్షేత్రస్థాయి సిబ్బంది, వన్యప్రాణి నిపుణులు, పశువైద్య నిపుణుల సమన్వయంతో పులి కదలికలను సమీప గ్రామాలకు దూరంగా ఉంచడంలో అధికారులు విజయవంతమయ్యారని తెలిపారు. ప్రస్తుతం పులిని నేలకోట–పుడిపల్లి ప్రాంతంలోని కొండల పరిధిలోనే పరిమితం చేసినట్లు వెల్లడించారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పులిని సురక్షితంగా బంధించడం, అదే సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను కాపాడటం ప్రధాన లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. అటవీ శాఖ, ప్రత్యేక బృందాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా అటవీ శాఖ జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. అవసరం లేకుండా అడవి ప్రాంతాలకు వెళ్లకూడదని, పులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు విజ్ఞప్తి చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ