తెలంగాణ లీగ్ లో కాసుల వర్షం.. రూ.33 లక్షల రికార్డు ధరకు తిలక్ వర్మ
తెలంగాణ లీగ్ లో కాసుల వర్షం.. రూ.33 లక్షల రికార్డు ధరకు తిలక్ వర్మ
Telangana league


హైదరాబాద్, 07 జూన్ (హి.స.)

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ టీ20 లీగ్' (Player Auction) ప్రారంభ సీజన్ ఆటగాళ్ల వేలం ఊపందుకుంది. ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉదయం ప్రముఖ అంతర్జాతీయ క్రికెట్ వ్యాఖ్యాత చారు శర్మ (Charu Sharma) నేతృత్వంలో ఈ వేలం ప్రక్రియ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఊహించినట్లుగానే ఈ వేలంలో హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ప్లేయర్స్ మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కనీస ధర (Base Price) రూ.5 లక్షలతో వేలంలోకి వచ్చిన స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ కోసం ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ పోటాపోటీగా బిడ్లు వేయగా, మధ్యలో నల్గొండ జట్టు కూడా రేసులోకి వచ్చింది. చివరకు హోరాహోరీ పోరులో రూ.33 లక్షల భారీ ధరకు తిలక్ వర్మను మెదక్ ఫాల్కన్స్ సొంతం చేసుకుంది. ఇక మరో స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు వరంగల్ వారియర్స్ జట్టు రూ.14 లక్షలు వెచ్చించి సిరాజ్ను కొనుగోలు చేసింది. అనంతరం ప్రారంభమైన 'ఎ ప్లస్' కేటగిరీ ప్లేయర్ల వేలంలో స్టార్ ప్లేయర్ అమన్ రావును కూడా వరంగల్ వారియర్స్ జట్టు రూ.12 లక్షలకు దక్కించుకోవడం విశేషం. ఐకాన్, 'ఏ ప్లస్' కేటగిరీలో లోకల్ స్టార్ ప్లేయర్లకు సైతం ఊహించని విధంగా రేటు పలికింది. రూ.5 లక్షల బేస్ ప్రైస్తో వచ్చిన సీవీ మిలింద్ను రూ.17 లక్షల భారీ ధరకు అన్విత ఖమ్మం ఏసెస్ సొంతం చేసుకుంది. అలాగే కనీస ధర రూ.5 లక్షలు ఉన్న రవికిరణ్ను రూ.13 లక్షలకు పాలమూరు స్ట్రైకర్స్ కొనుగోలు చేసింది. రవితేజను రూ.12 లక్షలకు మెదక్ ఫాల్కన్స్, తనయ్ త్యాగరాజన్ను రూ.11 లక్షలకు రంగారెడ్డి జట్టు దక్కించుకున్నాయి. మరోవైపు తన్మయ్ అగర్వాల్ను కరీంనగర్ డైమండ్స్ రూ.8 లక్షలకు, రాహుల్ బుద్దిని అనురాగ్ నల్గొండ నైట్స్ రూ.8 లక్షలు, రోహిత్ రాయుడును పాలమూరు స్ట్రైకర్స్ రూ. 6.5 లక్షలకు కొనుగోలు చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande