ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా శిధిలావస్తలో ఉన్న అంతరాష్ట్ర రహదారి కి చర్యలు
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా శిధిలావస్తలో ఉన్న అంతరాష్ట్ర రహదారి కి చర్యలు
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా  శిధిలావస్తలో ఉన్న అంతరాష్ట్ర రహదారి కి చర్యలు


సీలేరు, 08 జూన్ (హి.స.)

ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న అంతర్రాష్ట్ర రహదారి బాగుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భారీగా నిధులు విడుదల చేస్తోంది. గూడెంకొత్తవీధి మండలం ఆర్వీ నగర్ నుంచి పోలవరం జిల్లా వై.రామవరం మండలం పాలగెడ్డ వరకూ 75.6 కిలోమీటర్ల రహదారిలో నాలుగు రాష్ట్రాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారి విస్తరణ కోసం గతంలో తెదేపా ప్రభుత్వం 2016-17లో రూ. 84 కోట్లు విడుదల చేసింది.

రహదారి విస్తరణకు టెండరు ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ.. అటవీ అభ్యంతరాలతో పనులు ప్రారంభం కాలేదు. తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ టెండర్లను రద్దు చేసింది. దీంతో రహదారి విస్తరణ కలగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్డు ఛిద్రమైంది. ఎక్కడా రహదారి ఆనవాళ్లు కనిపించలేదు. పెద్దపెద్ద గోతులు పడి ఈ మార్గంలో ప్రయాణమంటేనే వాహనచోదకులు హడలిపోయే పరిస్థితి నెలకొంది. 2024 సెప్టెంబర్ 8న సంభవించిన తుపానుకు కొద్దోగొప్పో ఉన్న రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. కల్వర్టులు పాడయ్యాయి.

ఈ రహదారి పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి సంధ్యారాణి.. ఆర్వీనగర్- పాలగెడ్డ మార్గంలో 49 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి 16.5 కోట్లు రాష్ట్ర విపత్తుల ఉపశమన నిధులు (ఎస్డీఎంఎఫ్) విడుదల చేశారు. ఈ పనులకు టెండర్లు నిర్వహించారు. గుత్తేదారు పనులు చేపట్టడానికి ముందుకు వచ్చినప్పటికీ.. 2016-17లో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడంతో పనులు ప్రారంభంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు గుత్తేదారును ఒప్పించి కోర్టులో కేసు రద్దు చేయించి పనులు ప్రారంభించారు.

అదనంగా రూ.4 కోట్లు..:ఈ పనులకు 16.5 కోట్లు సరిపోవని ర.భ.శాఖ అధికారులు పేర్కొన్నారు. అదనంగా రూ. 4 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ర.భ.శాఖ ఉన్నతాధికారులు స్పందించి.. రాష్ట్ర రహదారి ప్రణాళిక గ్రాంట్ (ఎస్డబ్ల్యూపీ) నుంచి అదనంగా రూ. 4 కోట్లు విడుదల చేశారు. ఈ పనులకు ర.భ.శాఖాధికారులు టెండర్లు ఆహ్వానించారు. త్వరలో పనులు పూర్తిచేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

డిసెంబరు నాటికి పూర్తిచేస్తాం..:ఆర్వీ నగర్ నుంచి నూతిబంద వరకు రూ. 8 కోట్లతో రహదారి పూర్తిచేశాం. రెండో రీచ్లో పనులు ప్రారంభించాం. కొత్తగా వచ్చిన నిధులతో పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి.. డిసెంబరు కల్లా 75.6 కిలోమీటర్ల రహదారిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటాం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande