మద్యం.మత్తులో.అన్నదమ్ములు అర్ధరాత్రి వీరంగం
మద్యం.మత్తులో.అన్నదమ్ములు అర్ధరాత్రి వీరంగం
మద్యం.మత్తులో.అన్నదమ్ములు అర్ధరాత్రి వీరంగం


అమరావతి, 08 జూన్ (హి.స.)

పటమట, మద్యం మత్తులో అన్నదమ్ములు అర్ధరాత్రి జాతీయ రహదారిపై కారు ఆపి వీరంగం సృష్టించిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ప్రశ్నించిన వాహనదారులతో పాటు పోలీసులపైనా దాడి చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడ వన్టౌన్ చిట్టినగర్కు చెందిన వెంగళ బాలాజీ, వెంగళ వినీత్ అన్నదమ్ములు. బాలాజీ నగల దుకాణం నడుపుతాడు. వినీత్ చెన్నైలో హోటల్ నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మద్యం తాగి కామినేని ఆసుపత్రి రోడ్డు నుంచి ఎనికేపాడు మీదుగా చిట్టినగర్ వెళ్తున్నారు. మద్యం మత్తులో చొక్కాలు విప్పి డోర్లు తీసి థార్ కారు నడుపుతున్నారు. ప్రసాదంపాడు వద్ద ఆటోడ్రైవర్ హారన్ కొట్టి డోర్లు వేసుకోవాలని సూచించారు.

దాంతో కారు రోడ్డు మధ్యలో ఆపి హారన్ ఎందుకు కొట్టావంటూ ఆటోడ్రైవర్పై దాడి చేశారు. ఆటోను రాడ్లతో కొట్టి ధ్వంసం చేశారు. అనంతరం జాతీయ రహదారిపై అడ్డంగా నిలబడి లారీలను ఆపారు. ట్రాఫిక్ నిలిచిపోయింది. స్కూటీపై వెళ్తున్న ఒకరిని లాగారు. వాహనాన్ని పడేశారు. రాత్రి విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నాగశ్రీనివాసరావు వచ్చి వారిని ఆపే ప్రయత్నం చేశారు. అతనిపై కూడా దాడి చేసి చంపేస్తామని బెదిరించారు. దాడిలో కానిస్టేబుల్ ముఖం, కంటికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పటమట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మద్యం పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో కూడా పోలీసులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. విధుల్లో ఉన్న మహిళా ఎస్సై పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. రోడ్డు మీద పడుకొని ఎక్కడికీ రామంటూ హంగామా చేశారు. కానిస్టేబుల్ నాగ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు అన్నదమ్ములపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande