
విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం),08 జూన్ (హి.స.) కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్తెలిపారు. అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు రాష్ట్రంలో 56 మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపొచ్చని తెలిపారు. ఆదివారం ప్రకాశం జిల్లా కరేడులో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు.,
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ