
అమరావతి, 08 జూన్ (హి.స.)
మాడుగుల, పాడేరు, చింతపల్లి గ్రామీణం,: మన్యంలోనూ రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. మనుషులకే తాగునీరు దొరకడం కష్టమైన వేళ.. మూగజీవాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పశువుల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గతంలో ఉపాధి హామీ పథకం కింద నీటి తొట్టెల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ తొట్టెల్లో చాలాచోట్ల నీరులేక వెలవెలబోతుండడంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు.
ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 22 మండలాల పరిధిలోని 430 పంచాయతీల్లో 1432 నీటి తొట్టెల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ. 33 వేల చొప్పున ఖర్చు చేశారు. వీటిలో ఇప్పటివరకు అల్లూరి జిల్లాలో 331 తొట్టెల నిర్మాణాలు పూర్తయ్యాయి.
జిల్లాలో మొత్తం 4,53,022 పశువులు ఉన్నాయి. వీటిలో 61,250 పాలిచ్చే ఆవులు, 12,546 గేదెలు ఉన్నాయి. పశువులకు తాగునీటి వసతి కల్పించేందుకు ఈ తొట్టెలను రహదారులు పక్కన, గ్రామాల సమీపంలో, నీటి నిల్వలు ఉన్న చోట్ల నిర్మించారు. అనేక ప్రాంతాల్లో నీటి వనరులకు దూరంగా నిర్మించడం, నీరు నింపే వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. అధికారుల సమన్వయ లోపం కూడా ప్రధాన సమస్యగా మారింది. పంచాయతీ అధికారులు తొట్టెలకు నీరు అందించాల్సి ఉన్నప్పటికీ చాలా చోట్ల పట్టించుకోవడం లేదు.
దాహంతో అలమటిస్తున్న పశువులు చెరువులు, వాగులు, గెడ్డల వద్ద నీటి కోసం తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పశువుల కోసం నిర్మించినవి ఉపయోగపడాలంటే క్రమం తప్పకుండా నీరు అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైతులు, పశుపోషకులు కోరుతున్నారు. కేవలం నిర్మాణాలతో సరిపెట్టకుండా నిర్వహణపై దృష్టి సారిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ