
అమరావతి, 08 జూన్ (హి.స.), విశాఖపట్నం : భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని చూస్తున్నారు. దీంతో విమాన ప్రయాణికులు విశాఖ నుంచి అక్కడి వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ప్రస్తుతం నగరంలోని ట్రాఫిక్ వలయాన్ని దాటుకుని వెళ్లాలంటే 2గంటల సమయం పడుతుంది. మూడు, నాలుగు మార్గాలున్నప్పటికీ ఏ దారిలో వెళ్లినా గంటన్నరపైగానే పట్టనుంది. ఎక్కడ నుంచి ఎంత సమయం పట్టనుందో అధికార యంత్రాంగం అధ్యయనం చేసింది.
పేరుకే ప్రత్యామ్నాయ మార్గాలు: విశాఖ నుంచి భోగాపురం చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. రద్దీ వేళల్లో హనుమంతువాక, ఎండాడ, పీఎంపాలెం, మధురవాడ, కొమ్మాది, మారికవలస, ఆనందపురం మార్గాల్లో వెళ్తే 1.50 గంటల సమయం పడుతుంది.
80 కి.మీ. అయినప్పటికీ..: అనకాపల్లి నుంచి భోగాపురం విమానాశ్రయం 80 కి.మీ. దూరంలో ఉండగా గంటన్నరలోనే చేరుకోవచ్చు. అనకాపల్లి నుంచి ఎన్హెచ్-16 బైపాస్ గుండా ఆనందపురం మీదుగా అక్కడికి వెళ్లవచ్చు. ఎక్కడా ట్రాఫిక్ అడ్డంకులు లేకపోవడంతో కాస్త తొందరగా చేరుకుంటారు. విశాఖ నుంచి దూరం తక్కువైనా ట్రాఫిక్ తిప్పలతో ఆలస్యం తప్పడం లేదు.
ఆ రోడ్లతో ప్రయోజనం శూన్యం
రద్దీ నియంత్రణకు వీఎంఆర్డీఏ ఏడు రోడ్లు ప్రతిపాదించింది. అడవివరం-శొంఠ్యాం, వేపగుంట-పినగాడి రోడ్డు తప్ప మిగిలిన వాటితో పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. తిమ్మాపురం-మారికవలస, బోయపాలెం-కాపులుప్పాడ, భీమిలి-దొరతోట రోడ్లు అంతర్గతంగా ఆయా ప్రాంతాల అనుసంధానానికి మాత్రమే ఉపయోగపడేలా ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ