
హైదరాబాద్, 08 జూన్ (హి.స.)
రుతుపవనాల ప్రారంభాన్ని, వేసవి గరిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదలను, వ్యవసాయ చక్రం మొదలును సూచించే సాంప్రదాయక కార్యక్రమం మృగ శిర కార్తె. ఈ కాలంలో చేపలు, సముద్రపు ఆహారం తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారని తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె రోజున చేపలు తినడం వల్ల శ్వాసకోశ సంబంధిత రుగ్మతలు తగ్గుతాయని, అదే విధంగా రుతు మార్పులకు శరీరం సన్నద్ధమవుతుందని భావిస్తారు.
కాగా మృగ శిర కార్తెను పురస్కరించుకొని మెదక్,హవేలి ఘన్పూర్ మండలాలలో మండల కేంద్రంతో పాటు కొముటూర్, మంబోజి పల్లి, బ్యాతోల్ తిమ్మాయిపల్లి, పరిసర గ్రామాల్లో చెరువుల వద్ద చేపల కొనుగోళ్లు జోరందుకున్నాయి. కార్తె తొలి రోజున చేపలు తినడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ కావడం వల్ల, స్థానిక చేపల మార్కెట్లు, తాత్కాలిక విక్రయ కేంద్రాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి.
ఈ సందర్భంగా మార్కెట్లలో ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది. చెరువుల నుండి సేకరించిన తాజా రొహు, బొచ్చె (కట్ల) వంటి వివిధ రకాల చేపలను పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచారు.
గోదావరిఖనిలో సోమవారం తెల్లవారు జామున నుంచే మృగశిర సందడి కనిపించింది. నగరంలోని ప్రధాన చేపల మార్కెట్ తో పాటు రోడ్ల పక్కన చేపల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగాయి.
ఎల్లంపల్లి జలాశయం, గోదావరి నది, చుట్టు ప్రక్కల గ్రామాల చెరువుల నుంచి పెద్ద సంఖ్యలో చేపలను తీసుకవచ్చి రోడ్ల ప్రక్కన కుప్పలుగా పోసి విక్రయించారు. మృగశిర ప్రభావంతో సాధారణ రోజుల కంటే అధిక ధరలకు విక్రయించారు. ఐనప్పటికీ చేపలు కొనేందుకు స్థానికులు ఎగబడ్డారు. దీంతో ఇంటింటా పచ్చి చేపల పులుసు వంటకాలు ఘుమ ఘుమలాడాయి. అలాగే గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బత్తిని వంశస్థులు చేప మందు పంపిణీ చేయగా, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వారు చేప మందు ప్రసాదం తీసుకున్నారు.
కార్తెను దృష్టిలో ఉంచుకుని చేపల వ్యాపారులు నిత్యం వ్యాపారం కన్న పెద్ద ఎత్తున చేపలను తెప్పించి అమ్ముతున్నారు. మామూలు రోజుల్లో తెల్ల చేపలు కిలోకు రూ.150 వరకు ఉంటే మృగశిర రోజున కిలో 180, నుంచి 200 రూపాయలు, బొమ్మె చేపలను ఏకంగా ఐదు నుంచి ఆరు వందలకు అమ్మారు. వ్యాపారులు చేపల ధరలను భారీగా పెంచారు. కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకన్న ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..