వార్డు సభలతో ప్రజల వద్దకే పాలన : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర
వార్డు సభలతో ప్రజల వద్దకే పాలన : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర
Nalgonda


నల్గొండ, 08 జూన్ (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక* కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం మూడవ విడతగా ప్రత్యేక వార్డు సభలు నిర్వహించబడ్డాయి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వార్డు స్థాయిలోనే పరిష్కార చర్యలు చేపట్టడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, ప్రజల భాగస్వామ్యంతో నగరాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే ఈ వార్డు సభల ప్రధాన ఉద్దేశ్యమని మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర తెలిపారు. వార్డు సభల సందర్భంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్-2026, ఫోర్-వే వేస్ట్ సెగ్రిగేషన్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి వద్ద చెత్తను తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక సంరక్షణ చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. పరిశుభ్రమైన నగర నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు.

అదేవిధంగా జల్ సంచయ్ - జల్ భాగీధారి” కార్యక్రమం కింద వర్షపు నీటి సంరక్షణ చర్యలు, ఇంకుడు గుంతల ఏర్పాటు, రూఢాప్ రైన్వాటర్ హార్వెస్టింగ్ ప్రాముఖ్యతపై వివరించారు. భూగర్భజలాలను పరిరక్షించేందుకు ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీల పూడికతీత, మురుగు కాలువల శుభ్రత, వర్షపు నీటి పారుదల వ్యవస్థల నిర్వహణ, నీటి నిల్వలు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి నివారణకు ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande