
తిరుమల, 08 జూన్ (హి.స.)
తిరుమల తిరుపతి కొండపై 3 వారాలుగా భక్తుల రద్దీ (Crowd of devotees) కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవుల కారణంగా మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుండటంతో తిరుమల వీధులన్ని కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో టోకెన్లు లేని సామాన్య భక్తుల సర్వదర్శనం కొరకు క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 24 గంటల సుదీర్ఘ సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు క్యూలైన్లలో భక్తులకు అవసరమైన వసతులను పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే నిన్న ఆదివారం ఒక్కరోజే మొత్తం 93,230 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే 41,754 మంది భక్తులు కళ్యాణ కట్ట లో తలనీలాలు సమర్పించారు. భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమర్పించిన నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు తెలుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV