
భద్రాద్రి కొత్తగూడెం, 09 జూన్ (హి.స.)
అర్హులైన పేదలందరికీ సొంత గూడు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మంగళవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి.. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడంతో పాటు నూతన గృహాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న పూసుకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని కట్కూరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఫేస్-1 కింద లబ్ధిదారు యాట్ల శ్రీదేవి ఇంటిని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పూసుకుంటలో మరో లబ్ధిదారు పూనెం రాధ నూతన గృహాన్ని స్థానిక మహిళ యాట్ల నాగమ్మతో కలిసి ప్రారంభించి, గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా గ్రామంలో అందరికీ ఇళ్లు రాలేదన్న విషయాన్ని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన, రెండో విడతలో కట్కూరు గ్రామానికే తొలి ప్రాధాన్యం ఇచ్చి అందరికీ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు సూచించారు.
అనంతరం పూసుకుంట గ్రామస్థులు తమ స్థానిక సమస్యలను మంత్రికి విన్నవించారు. విద్యుత్, సోలార్ లైట్ల ఏర్పాటుతో పాటు ప్రధానంగా పోడు భూముల పట్టాల సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. అటవీ, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించి పోడు రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు. అలాగే గ్రామంలో రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అంకిత్, సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు