తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. రికార్డు స్థాయిలో దర్శనాలు
తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. రికార్డు స్థాయిలో దర్శనాలు
తిరుమల


తిరుమల, 09 జూన్ (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. మరికొద్ది రోజుల్లో విద్యాసంస్థలు రీ ఓపెన్ కానుండగా.. శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి స్వామివారి ఉచిత దర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. భక్తులు శిలాతోరణం వరకూ క్యూలైన్లో వేచి ఉన్నారు. 8 గంటల తర్వాత ఎలాంటి టోకెన్లు లేకుండా దర్శనానికి వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనానికి 15-18 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని పేర్కొంది.

నిన్న (సోమవారం) స్వామివారిని రికార్డుస్థాయిలో 95,152 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,601 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు సమకూరింది. కాగా.. నిన్న మొత్తం 4.21 లక్షల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande