
తెనాలి టౌన్, 10 జూలై (హి.స.)
,: తెనాలి రచయిత షేక్ అబ్దుల్ హకీంజానికి అరుదైన గౌరవం దక్కింది. ఆయన రచనను మహారాష్ట్ర పాఠ్య పుస్తకంలో చేర్చారు. మహారాష్ట్రలో తెలుగు చదివే విద్యార్థుల కోసం అక్కడి రాష్ట్ర పాఠ్య పుస్తక నిర్మిత, పాఠ్య ప్రణాళిక పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది రూపొందించిన 6వ తరగతి బాల భారతి పుస్తకంలో తెనాలి ఉపాధ్యాయుడు, బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీంజాని రచన చేర్చింది. పుట్టుకతోనే రెండు చేతులు లేని దివ్యాంగురాలైన శీతల్ దేవి కాళ్లతో విలువిద్యను నేర్చుకుని, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన తీరును, ఆమె జీవిత చరిత్రను హకీంజాని ‘అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఆర్చర్ శీతల్ దేవి’ శీర్షికతో రచించారు. గతంలో హకీంజాని రచించిన ‘బాధ్యతాయుత పౌరుడు’ కథ 2019లో 11వ తరగతి, ‘కొత్త వెలుగు’ కథ 2020లో 12వ తరగతి మహారాష్ట్ర తెలుగు పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచారు. ఈ వివరాలను ఆయన గురువారం తెనాలిలో తెలియజేశారు. తన కథను పాఠ్యాంశంగా ఎంపిక చేసిన మహారాష్ట్ర పాఠ్య పుస్తక నిర్మిత, పాఠ్య ప్రణాళిక పరిశోధనా సంస్థ, తెలుగు కమిటీ అధ్యక్షురాలు భమిడిపాటి శారద, సంస్థ విశేషాధికారిణి డాక్టర్ తులసీ భరత్ భూషణ్, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ