
హైదరాబాద్, 14 జూలై (హి.స.)హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు. ఈ సోదాల్లో అతని వద్ద ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు భారీగా గుర్తించినట్లు తెలిపారు. సోదాల అనంతరం ఆయన మాట్లాడారు. సుమధుర అక్రోపోలిస్లో 3BHK ఫ్లాట్, శ్రీవారి మెడోస్లో మరో ప్లాట్ ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వాసవి అట్లాంటిస్లో ఏకంగా మూడు ప్లాట్లు కొనుగోలు చేసినట్లు కనుగొన్నామని చెప్పారు. మసీద్ బండలో నాలుగు అంతస్తుల భారీ భవనం, జడ్చర్లలో 7 ప్లాట్లు, కొండాపూర్లో రెండు ప్లాట్లు ఉన్నాయని వివరించారు.
శంషాబాద్, షాబాద్ పరిధిలో 4 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు తమకు ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. సోదాల్లో అర కిలో బంగారం, వెండి వస్తువులతో పాటు రూ.10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సీజ్ చేశామని అన్నారు. అలాగే బచ్చు రవీందర్ పేరిట ఉన్న 4 బ్యాంక్ లాకర్లను గుర్తించి.. వాటిని ఫ్రీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. ఆస్తులతో పాటు ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా దాచి ఉంచిన 18 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్