ప్రజా సంక్షేమం ఆపే ప్రసక్తే లేదు.. డిప్యూటీ సీఎం
ప్రజా సంక్షేమం ఆపే ప్రసక్తే లేదు.. డిప్యూటీ సీఎం
Deputy CM


జోగులాంబ గద్వాల, 14 జూలై (హి.స.)

పదేళ్ల పాటు రాష్ట్ర సంపదను దోచుకుని తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన వారు మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతున్నారని, వచ్చి పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేయడానికేనా అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండలం జులేకల్ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం తెలంగాణను రూ.8.21 లక్షల కోట్ల అప్పులతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించిందని ఆరోపించారు. అయినప్పటికీ రెండున్నరేళ్లలో రూ.2.08 లక్షల కోట్ల అసలు, వడ్డీ చెల్లిస్తూ ప్రజా సంక్షేమాన్ని ఏమాత్రం తగ్గించకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

రాష్ట్రంలో ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ భీమా, వడ్డీలేని మహిళా రుణాలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల వంటి పథకాలను నిరంతరంగా అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం ఇప్పటికే ఆర్టీసీకి రూ.12 వేల కోట్లు చెల్లించామని, కోటి 6 లక్షల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు, రాగిజావ అందిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నామని, హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచామని చెప్పారు. అదనంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేసి రూ.22,500 కోట్లతో నిర్మాణాలు చేపడుతున్నామని, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ భీమా పథకాన్ని నవంబర్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రెండున్నరేళ్లలో డ్వాక్రా సంఘాలకు రూ.76 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని తెలిపారు. అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై స్పందిస్తూ, మల్లమ్మకుంట రిజర్వాయర్కు అవసరమైన 573 ఎకరాల భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande