
తిరుపతి, 10 జూలై (హి.స.)
తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్గా తీర్చిదిద్దుతామని ఇటీవల ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని నిలబెట్టుకునే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) పరిధిలో వాతావరణ అనుకూల సమగ్ర జల నిర్వహణ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. దీంతో ఏకంగా రూ.750 కోట్ల భారీ ప్రాజెక్టుకు కదలిక వచ్చింది. తిరుపతి, పరిసరాల్లోని పాతిక చెరువులను అభివృద్ధి చేయడం ఇందులో కీలకాంశం. తిరుపతికి సీఎం చంద్రబాబు ఎప్పుడు వచ్చినా నగరాభివృద్ధిపై కీలక ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుపతి భవిష్యత్తులో కీలక నగరంగా ఆవిర్భవిస్తుందని, దానికనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. భవిష్యత్తులో తిరుపతిలో తాగునీరు, భూగర్భ జలాల సమస్య తలెత్తకుండా వర్షపు నీటిని నిల్వ చేసుకునే సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, తుడా, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా దీనిపై దృష్టి సారించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ