
సంగారెడ్డి, 10 జూలై (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడంతో పాటు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సత్వర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరిస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్తో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా అన్ని మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను కల్పిస్తూ ఈఎస్ఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే కార్మికులు వైద్య చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 80 లక్షల కుటుంబాలు ఈఎస్ఐ వైద్య సేవలపై ఆధారపడుతున్నాయని, ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.
ఇటీవల ఆర్సీ పురం ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా కొన్ని ప్రత్యేక వైద్య సేవలు లేకపోవడంతో రోగులు సనత్నగర్కు వెళ్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వచ్చే ఆరు నెలల్లో అక్కడ అన్ని ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, కార్మికులు స్థానికంగానే పూర్తి స్థాయి చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో ఆర్సీపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో 20 పడకల డయాలసిస్ యూనిట్ను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే ఏడాదిలో కార్డియాలజి సెంటర్ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. శంషాబాద్, రామగుండం, మహబూబ్నగర్ ప్రాంతాల్లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక భారం మోసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ కార్మికులు ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటికే ఏడు ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉండగా, సంగారెడ్డిలో ఎనిమిదో డిస్పెన్సరీని ప్రారంభించడం సంతోషకరమన్నారు. రూ.200 కోట్లతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..