తెలంగాణ మత్స్యకారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు.. మంత్రి వాకిటి
తెలంగాణ మత్స్యకారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు.. మంత్రి వాకిటి
Minister


హైదరాబాద్, 10 జూలై (హి.స.)

తెలంగాణ మత్స్యకారులకు

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని కోహెడలో 13 ఎకరాల లో రూ.47.03 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎగుమతి ఆధారిత హోల్ సేల్ చేపల మార్కెట్ ను మంత్రి వాకిటి శ్రీహరి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. దేశంలోనే సముద్రతీర ప్రాంతం కాకుండా అంతర్గత రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తొలి ఆధునిక మంచినీటి చేపల ఎగుమతి కేంద్రంగా కోహెడ మార్కెట్ నిలవనుందని తెలిపారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే చేపలకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను విస్తరించడంలో ఈ కేంద్రం కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ మార్కెట్లో ఆధునిక శీతల గిడ్డంగులు, శుద్ధి యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు, శిక్షణా కేంద్రం, కస్టమ్స్ సదుపాయాలు, భారీ హోల్సేల్ మార్కెట్ వంటి అన్ని వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుమారు రెండు వేల మంది వ్యాపారులు ఇక్కడ వ్యాపారం నిర్వహించే అవకాశం ఉండగా, ఐదు వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande