
అమరావతి, 11 జూలై (హి.స.)10,
చిత్తూరు జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లు ఉండగా, శుక్రవారం రాత్రి నాటికి 13,39,847 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ (99.98శాతం) చేశారు. పంపిణీ చేసినవాటిలో 10,87,403 (81.14శాతం) ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఇంకా 210,915 ఫారాల్ని ఈ నాలుగు రోజుల్లో డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. కాగా, సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని మొత్తం ఓట్లలో లక్ష ఓట్లు తొలగిపోనున్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్ సుమిత్కుమార్ ప్రకటించారు. మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, రెండుచోట్ల ఓటు ఉన్నవారు, బీఎల్వోలు వచ్చినప్పుడు ఇంటి వద్ద ఆబ్సెంట్ అయినవారు..
ఇలా వివిధ కేటగిరీల్లో ఓట్ల తొలగింపు జరగనుంది. అన్ని కేటగిరీల్లో ఇప్పటివరకు 41808 ఓట్లను తొలగించగా, ఈ నాలుగు రోజుల్లో ఆ సంఖ్య సుమారు లక్షకు చేరుతుందని కలెక్టరే స్వయంగా చెప్పారు. చిత్తూరులో అత్యధికంగా 10215 ఓట్లు ప్రస్తుతానికి తొలగించగా, నాలుగు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు కానుంది. పలమనేరులో 8021, నగరిలో 7532, పూతలపట్టు 6998, కుప్పం 4626, జీడీనెల్లూరు 4416 ఓట్లను ప్రస్తుతానికి తొలగించగా.. ప్రక్రియ ముగిసేనాటికి ఈ సంఖ్య ఇంకా పెరగనుంది.
ఓటరు జాబితాలో పేరు లేకుంటే..?
14వ తేదీన సర్ ప్రక్రియ పూర్తయ్యాక ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు విడుదల చేస్తారు. పోలింగ్ కేంద్రాల వారీగా రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందిస్తారు. అందులో పేరు లేకుంటే ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకు మళ్లీ ఫాం-6 ద్వారా ఓటు హక్కుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా జిల్లాలో ప్రతి నెలా 15 నుంచి 20 వేల మంది 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటు హక్కు కోసం అర్హత సాధిస్తున్నారు. లక్ష ఓట్లు తొలగిపోయినా, 15-20 వేల ఓట్లు కొత్తగా రానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ