
నాగర్ కర్నూల్, 11 జూలై (హి.స.)
పేద ప్రజలకు అత్యాధునిక వైద్య
సేవలు అందుబాటులోకి రావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీశైలం—-హైదరాబాద్ జాతీయ రహదారిపై పోస్టాఫీస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'విహా' మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. తలకొండపల్లి మండలానికి చెందిన ప్రముఖ శిశు వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటేష్ దంపతుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, సీఐ వెంకటేశ్వర్లతో కలిసి రిబ్బన్ కత్తిరించి, జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఓపీ, ఇన్పేషెంట్ వార్డులు, అత్యవసర చికిత్స విభాగం, ల్యాబ్ తదితర సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న తరుణంలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా నాణ్యమైన సేవలు, అందుబాటు ధరల్లో చికిత్స అందించడం ద్వారా ప్రజలకు తోడ్పడాలని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ 'విహా' మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రజల విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు