రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి
MLA


జనగాం, 11 జూలై (హి.స.)

రైతన్నల సంక్షేమానికి కాంగ్రెస్

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఆరు నూరైనా ప్రతి పంటకు సాగునీరు అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్టేషన్ఫన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం రఘునాథపల్లి మండలంలోని మండలగూడెం గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఆయన, మరో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.

సర్పంచ్ డేగల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండున్నరేళ్లలో గ్రామానికి 33/11 కేవీ సబ్జెస్టేషన్ మంజూరు చేయించడంతో పాటు రూ.20 లక్షలతో బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి కాలువ మరమ్మతులు చేపట్టించి మల్క చెరువును గోదావరి జలాలతో నింపినట్లు తెలిపారు. దీంతో సాగునీరు అందడంతో రైతులకు మెరుగైన దిగుబడులు వచ్చాయని చెప్పారు. గ్రామానికి మరో 20 ఇందిరమ్మ ఇళ్లు, రూ.20 లక్షల విలువైన సీసీ రోడ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ప్రాజెక్టు ద్వారా బొమ్మకూరు రిజర్వాయర్కు గోదావరి జలాలు అందించి రైతుల పంటలను కాపాడే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande