
తిరుపతి , 11 జూలై (హి.స.) తిరుపతి రాయలచెరువు సమీపంలోని శ్రీ శక్తి పీఠంలో జూలై 15 నుంచి శ్రీ వారాహి దేవి ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
తిరుపతి రాయలచెరువు సమీపంలోని శ్రీ శక్తి పీఠంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వారాహి దేవి ఆరాధన మహోత్సవాలు ఈ నెల జూలై 15 వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు పీఠం మేనేజర్ ప్రసాద్ మహిళా విభాగం ఇన్చార్జి మాధవి తిరుమలరెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ ఆశీస్సులతో, పీఠాధీశ్వరి శ్రీ రామ్యానంద భారతి స్వామిని ఆధ్వర్యంలో జూలై 15 నుంచి శ్రీ శక్తి పీఠంలో శ్రీ వారాహి దేవి ఆరాధన మహోత్సవాల్లో అత్యంత వేడుకగా జరగనున్నాయని పేర్కొన్నారు.
ఈ ఉత్సవాలలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, అలంకార సేవలు, దేవి ఉపాసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల సంక్షేమం, కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారాభివృద్ధి, శత్రు నివారణ, దుష్టశక్తుల నివారణ కోసం ప్రత్యేకంగా శ్రీ వారాహి దేవి ఆరాధన నిర్వహించబడుతుందని నిర్వాహకులు వెల్లడించారు.
మహోత్సవాల సందర్భంగా పాల్గొనే భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు, ప్రసాద వితరణతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని పీఠాధికారులు ఆహ్వానించారు. ఈ విలేకరుల సమావేశంలో శక్తిపీఠం మీడియా ఇన్చార్జి యుగంధర్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV