తెలంగాణలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలలో హ్యూమనాయిడ్ రోబో టీచర్లు!
తెలంగాణలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలలో హ్యూమనాయిడ్ రోబో టీచర్లు!
robo


హైదరాబాద్, 11 జూలై (హి.స.)

తెలంగాణలో ప్రభుత్వ విద్యకు సాంకేతికతను మరింత చేరువ చేసే మరో కీలక అడుగు పడింది. సుమారు 750 మంది విద్యార్థులు చదువుతున్న రంగారెడ్డి జిల్లా జన్వాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో త్వరలో మూడు హ్యూమనాయిడ్ రోబోటిక్ టీచర్లు సేవలందించనున్నారు. సాధారణ తరగతి గదుల్లోనే ఈ రోబో టీచర్లు బోధనలో భాగమవ్వడం ద్వారా తెలంగాణలో ఈ తరహా సదుపాయం అందుకున్న తొలి ప్రభుత్వ పాఠశాలగా జన్వాడ జెడ్పీహెచ్‌ఎస్ నిలవనుంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. జూలై 8న జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ. నవీన్ నికోలస్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ ఫరీదా ఫ్రాజ్ తమ సంస్థల తరఫున ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు ఆధునిక బోధనతో పాటు విద్యా సహకారం, మెంటరింగ్, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి, పలు విద్యా కార్యకలాపాలు నిర్వహించనున్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కలిసి సర్వీస్ లెర్నింగ్, స్కూల్ ట్విన్నింగ్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.

ఈ సందర్భంగా ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ ఫరీదా ఫ్రాజ్ మాట్లాడుతూ, “ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి అవసరమైన నాణ్యమైన విద్యను అందించే స్థిరమైన నమూనాను రూపొందించాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి మేము భాగస్వాములమవుతున్నందుకు సంతోషంగా ఉంది” అని తెలిపారు.

ఇండస్ స్కూల్స్ కమ్యూనిటీ స్కూల్ ప్రాజెక్ట్ హెడ్ శామ్యూల్ జోసెఫ్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఎనిమిది నెలలుగా జన్వాడ పాఠశాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పాత భవనం శిథిలావస్థలో ఉండటంతో పాటు విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో, కొత్తగా జీ ప్లస్ 2 భవనాన్ని నిర్మించారు. విశాలమైన తరగతి గదులు, మెరుగైన మౌలిక సదుపాయాలతో విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande