వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయ చర్యల పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయ చర్యల పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
chandra babu


అమరావతి, 12 జూలై (హి.స.)

వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంతో పాటు మృతుల భౌతిక కాయాలను త్వరితగతిన స్వస్థలాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదంలో గాయపడిన గెల్లె కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి భౌతిక కాయాలను స్వదేశానికి తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాల అప్పగింత, తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు సీఎంకు తెలియజేశారు.

అదే సమయంలో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఈరోజే విమానాల ద్వారా వారి స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరికి అవసరమైన విమాన టిక్కెట్లను సంబంధిత మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

బాధితులంతా సురక్షితంగా స్వదేశానికి చేరుకునే వరకు, అలాగే మృతుల భౌతిక కాయాల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియలో వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande