హైదరాబాద్ నా సొంతూరులాగే : గాన కోకిలకు నగరంతో విడదీయలేని అనుబంధం
హైదరాబాద్ నా సొంతూరులాగే : గాన కోకిలకు నగరంతో విడదీయలేని అనుబంధం
S.Janaki


హైదరాబాద్, 12 జూలై (హి.స.)

తన మధురమైన స్వరంతో కోట్లాది మందిని అలరించి, శనివారం కన్నుమూసిన గానకోకిల ఎస్​.జానకికి హైదరాబాద్​ నగరంతో విడదీయ లేని అనుబంధం ఉంది. ఆమె నగరానికి వచ్చినప్పుడల్లా ఇదే సొంతూరులా అనిపిస్తుందని, ఇక్కడి వాతావరణం, ప్రజలు తనకెంతో నచ్చారని పదే పదే చెప్పేవారు. అదే ప్రేమతోనే కొంతకాలం క్రితం శంషాబాద్​ శ్రీశైలం రోడ్డులో ఓ విల్లా కొన్నారు. ఇక్కడే ఉంటూ మైసూర్​, చెన్నై వంటి ప్రాంతాలను సందర్శించేవారని సంగమం ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు సంజయ్​ కిశోర్​ పేర్కొన్నారు. అంతేకాదు ఆమె హైదరాబాద్​ రవీంద్రభారతి, త్యాగరాయగానసభ, శిల్పకళావేదిక, తెలుగు వర్సిటీలోని ఎన్టీఆర్​ కళామందిరంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రేక్షకుల కోరిక మేరకు ఈ పాట : పి.సుశీలకు గిన్నిస్​ బుక్​ రికార్డ్స్​లో చోటు దక్కినప్పుడు రవీంద్రభారతిలో జరిగిన అభినందన సభకు జానకి హాజరయ్యారు. ఈ సుశీల ట్రస్ట్​ ద్వారా నెలకొల్పిన పి.సుశీల జాతీయ అవార్డును ఎస్​.జానకికి ప్రదానం చేసినప్పుడు ఇది తనకు మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు. ఆమె ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ప్రేక్షకుల కోరిక మేరకు 'గోవుల్లు తెల్లన - గోపయ్య నల్లన' పాట పాడి ప్రేక్షకులను మురిపించే వారు. 2004లో 26 రోజులు కిన్నెర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీతోత్సవాన్ని అప్పటి సీఎం వైఎస్​.రాజశేఖర్ ​రెడ్డి, మంగళంపల్లి బాలమురళీకృష్ణతో కలిసి ఆమె ప్రారంభించడమే కాకుండా కచేరీ ఇచ్చారు.

1995లో కిన్నెర ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘంటసాలకు నిర్వహించిన 24 గంటల సంగీత విభావరి సందర్భంలో ఘంటసాల పురస్కారంతో ఎస్​.జానకిని అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావులు సత్కరించారని 'కిన్నెర' కార్యదర్శి మద్దాళి రఘురామ్​ పేర్కొన్నారు. తన కుమారుడు మురళీకృష్ణ జానకిని కార్యక్రమాలకు తీసుకొచ్చేవారని, భర్త, కుమారుడు చనిపోయిన తర్వాత ఆమె పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనలేదని తెలిపారు.

అభిమాని ఇంటికొచ్చిన గాయని జానకి : సంగారెడ్డి పట్టణానికి చెందిన మఠం రేవప్పయ్య పుట్టుకతోనే దివ్యాంగుడు. ప్రముఖ గాయని ఎస్​ జానకికి వీరాభిమాని. నడవలేని స్థితిలో ఉండటంతో తనను కలవలేకపోతున్నాడని తెలుసుకున్న జానకి 2015, ఏప్రిల్​ 26న స్వయంగా రేవప్పయ్య ఇంటికి వచ్చారు. ఆప్యాయంగా పలకరించారు. తాను ఎంతగానో ఆరాధించే గాయని మరణ వార్త చాలా బాధాకరమని ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఆమె తల్లిలాగా ఎంతో ఆరాధించేదని, మూడు సార్లు జానకి ఇంటికి వెళ్లగా ఆప్యాయంగా పలకరించారని గుర్తుచేసుకున్నారు. జూనియర్​ లెక్చరర్​గా ఉద్యోగం వచ్చాక వెళ్లినప్పుడు ఆమె చాలా సంతోషించారని పేర్కొన్నారు.

జాతీయ అవార్టులకు చిరునామా : పేరుకు తెలుగు గాయనే అయినా దక్షిణ భారతంలోని ప్రతి చిత్ర పరిశ్రమ ఎస్.జానకి స్వరాన్ని తమదిగా భావించింది. నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు, పలు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు ఆమె సొంతమయ్యాయి. తెలుగులో 12 నంది అవార్డులు అందుకున్న జానకి, కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11, తమిళనాడు నుంచి 6, ఒడిశా నుంచి ఒక పురస్కారాన్ని తీసుకున్నారు.

బాధను దిగమింగి పాడిన పాట : గాయనిగా ఎంతో ఎత్తుకు ఎదిగినా, ఎన్ని పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నా భర్త చాటు భార్యనేనని చెప్పుకునే ఎస్​ జానకమ్మ, తానెప్పుడూ భర్త చేతుల్లోనే వెళ్లిపోవాలని భగవంతుణ్ని కోరుకున్నప్పటికీ ఆ కోరిక నెరవేరలేదని, మొదట్లో ఆయనే వెళ్లిపోయారని, అది తన దురదృష్టమని ఓ సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే 'కార్తీక దీపం' సినిమాలో తాను పాడిన 'నీ చేతుల్లో తలవాల్సి'' పాట వెనకున్న విషాదకర ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ పాట రికార్డింగ్​ సమయానికి జానకి భర్త రాంప్రసాద్​ గుండెపోటుకు గురై హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. కానీ పాట రికార్డింగ్​కు అన్ని ఏర్పాట్లు జరగడంతో దాన్ని వాయిదా వేయలేని పరిస్థితి. ఇక చేసేదేమీ లేక జానకమ్మ ఆ కష్టాన్ని దిగమింగి భర్తనే తలచుకుంటూ ఎంతో ఆర్థ్రతతో 'నీ చేతుల్లో తలవాల్సి' గీతాన్ని ఆలపించారట.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande