గానకోకిల ఎస్ జానకి మృతికి సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం
గానకోకిల ఎస్ జానకి మృతికి సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం
చంద్రబాబు నాయుడు


కర్నూలు, 12 జూలై (హి.స.) భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి ఇక లేరు. ఆమె మరణం భారతీయ సంగీత రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి, తన ప్రత్యేక స్వరంతో శాశ్వత స్థానం సంపాదించుకున్నారనీ కీర్తించారు.

ఎస్. జానకి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లె అని. చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, అనంతరం సినీ రంగంలో అడుగుపెట్టి ఐదు దశాబ్దాలకు పైగా అద్భుతమైన గాన ప్రయాణాన్ని కొనసాగించారనీ. భావోద్వేగం, భక్తి, ప్రేమ, జానపదం, శాస్త్రీయ సంగీతం.. ఏ తరహా పాట అయినా తనదైన శైలిలో ఆలపించి గానకోకిలగా కోట్లాది మంది అభిమానుల అభిమానాన్ని పొందారనీ గుర్తు చేసుకున్నారు.

ఎస్. జానకి మరణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. తెలుగు ప్రజల గర్వకారణమైన ఆమె సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

కర్నాటకలోని మైసూరులో నేడు ఎస్. జానకి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు లభించిన ప్రజాదరణ, సంగీత రంగానికి అందించిన విశిష్ట సేవలను దృష్టిలో ఉంచుకుని అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని కర్నాటక ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కళాకారిణిగా ఆమెకు లభించిన గౌరవానికి తగిన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేశారు.

దశాబ్దాల పాటు తన మధుర గానంతో భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఎస్. జానకి భౌతికంగా దూరమైనా, ఆమె ఆలపించిన వేలాది అమరగీతాలు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆమె స్వరం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూ భారతీయ సినీ సంగీత చరిత్రలో ఎప్పటికీ చెరగని ముద్రగా మిగిలిపోతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande