
హిందూపురం, 12 జూలై (హి.స.)ప్రముఖ గాయని ఎస్ జానకి శనివారం సాయంత్రం మృతి చెందారు. 60 ఏళ్ల కెరీర్లో 48 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
ప్రముఖ గాయని ఎస్. జానకి గారి మృతి పట్ల హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి గారు తన గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. అనేక చిత్రాల్లో పాత్ర సన్నివేశాలకు, సందర్భాలకు అనుగుణంగా నవరసాలను పలికిస్తూ పాడిన పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయని పేర్కొన్నారు. వారు తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటుగా మొత్తం 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్నారని గుర్తుచేశారు. జానకమ్మ గారి మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటు అని పేర్కొన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ జానకి గారు కుటుంబ సభ్యులకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV