వియత్నాం ప్రమాదం: ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న తెలుగు పర్యాటకులు
వియత్నాం ప్రమాదం: ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న తెలుగు పర్యాటకులు
viyatnam


హైదరాబాద్, 12 జూలై (హి.స.)

వియత్నాంలో శనివారం జరిగిన ఘోర పడవ ప్రమాదం నుంచి బయటపడిన తెలుగు పర్యాటకులంతా సురక్షితంగా హనోయిలోని నోయ్ బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా ఆదివారం రాత్రి 7:05 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) వియత్నాం ఎయిర్‌లైన్స్ విమానంలో బయల్దేరి, భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకల్లా హైదరాబాద్ చేరుకోనున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ఫు క్వోక్ ద్వీపం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతిచెందగా, వారిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. ఓ మొబైల్ ఫోన్ కంపెనీ తమ డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన విహారయాత్రలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 32 మంది ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏపీకి చెందిన గెల్లి కిశోర్ అనే వ్యక్తి వియత్నాంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులను వీలైనంత త్వరగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

మరోవైపు, మరణించిన 15 మంది భారతీయుల మృతదేహాలను హో చి మిన్ నగరానికి తరలిస్తున్నట్లు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించింది. అక్కడ అవసరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత, మృతదేహాలను వీలైనంత త్వరగా భారత్‌కు పంపిస్తామని పేర్కొంది. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, ఏపీ ప్రభుత్వం, న్యూఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు బాధితులకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande