
హైదరాబాద్, 13 జూలై (హి.స.)కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాస, కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఓ ప్రకటనలో ఆరోపించారు. ‘‘భారాస కాళేశ్వరాన్ని సరిగా నిర్మించకుండా రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కారు ఈ ప్రాజెక్టును కోమాలోకి నెట్టింది. ఈ రెండు పార్టీల తీరుతో తెలంగాణ రైతులు బలవుతున్నారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం.. బ్యారేజీల యజమాని తెలంగాణ ప్రభుత్వమే. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ కమిటీలు సలహాలు మాత్రమే ఇస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. బ్యారేజీ మరమ్మతు పనులు చేయాల్సింది కాంగ్రెస్ సర్కారే. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇప్పటికే మూడు సార్లు నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని పదేపదే చెప్పినా ఎందుకు పెడచెవిన పెడుతున్నారు? కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, బాధ్యులను జైల్లో వేస్తామని గతంలో ప్రకటించింది కాంగ్రెస్సే. అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరపకుండా.. రూ.9 వేల కోట్ల అవినీతిపై విచారణకే పరిమితమైంది’’ అని బండి సంజయ్ విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్