
హైదరాబాద్, 13 జూలై (హి.స.)మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టికెట్ కోసం కొడుకు పేరు మార్చిన ఘనత కేసీఆర్ ది అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి పదవి రాలేదనే కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చారన్నారు. పార్టీ పెట్టి ఎలక్షన్లు, కలెక్షన్లు చేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రక్తదాహం, ధనదాహం, అధికార దాహం ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి పరిమితం చేశారన్నారు.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఎంపీ తెలిపారు. విద్యార్థులను రెచ్చగొట్టి బలిదానాలకు కారణమైంది బీఆర్ఎస్ అంటూ ఆరోపించారు. పిట్ట కథలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. కమీషన్లు దండుకోవడం తప్ప ఎకరానికి కూడా కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ‘పార్టీ పేరు మార్చుకున్న చరిత్ర మీకే దక్కింది’ అంటూ కేసీఆర్ను ఉద్దేశించి సెటైర్ విసిరారు. 2009లో కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులను కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలూ ఒక్కటే అని.. ఈటల రాజేందర్ను ఎంపీగా గెలిపించింది బీఆర్ఎస్ అంటూ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్